పుట్టిన రోజున పచ్చ తోరణం

జన హృదయ నేత పుట్టిన రోజును జిల్లా వాసులు హరిత వేడుకగా చేసుకున్నారు. పల్లె పట్నం అనే తేడా లేకుండా హరిత స్ఫూర్తితో కదిలారు.. ప్రజాప్రతినిధులు, అధికారులు, విద్యార్థులు ఇలా అందరూ మెతుకు సీమకు పచ్చతోరణంలా మొక్కలు నాటారు. సీఎం కేసీఆర్‌ 66వ పుట్టిన రోజు సందర్భంగా.. టీఆర్‌ఎస్‌ వర్కింగ్‌ ప్రెసిడెంట్‌, మంత్రి కేటీఆర్‌ మొక్కలు నాటుదామని ఇచ్చిన పిలుపునకు విశేష స్పందన వచ్చింది. ఎమ్మెల్యేలు పద్మాదేవేందర్‌రెడ్డి, మదన్‌రెడ్డి, కార్పొరేషన్‌ చైర్మన్‌ వంటేరు ప్రతాపరెడ్డి, జెడ్పీ  చైర్‌పర్సన్‌ హేమలతా శేఖర్‌గౌడ్‌, కలెక్టర్‌ ధర్మారెడ్డి, ఎస్పీ చందన దీప్తి.. ఇంకా మున్సిపల్‌ చైర్మన్లు, కౌన్సిలర్లు, జెడ్పీటీసీలు, ఎంపీటీసీలు, సర్పంచులు, ఇతర ప్రజాప్రతినిధులు, అధికారులు  విస్తృతంగా మొక్కలు నాటారు. పలుచోట్ల కేక్‌లు కట్‌చేసి సంబురాలు చేసుకున్నారు. ఇంకొందరు దవాఖానల్లో  పండ్లుపంపిణీ చేశారు. మరికొందరు సీఎం చిత్రపటాలకు క్షీరాభిషేకం చేశారు.  నమస్తే తెలంగాణ ఆధ్వర్యంలో నిర్వహించిన మొక్కలు నాటే  కార్యక్రమాలకు అనూహ్య స్పందన వచ్చింది. ప్రజాప్రతినిధులు, అధికారులతో కలిసి నమస్తే తెలంగాణ బృందం మేముసైతం అంటూ మొక్కలు నాటి హరిత స్ఫూర్తిని చాటింది.